ప్రపంచకప్ ప్రారంభానికి ముందు వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలెదుర్కోవడంతోపాటు జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం చేసుకున్న యువరాజ్‌సింగ్ ప్రపంచకప్ టోర్నీలో తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్ జైత్రయాత్రలో కీలక భూమిక పోషిస్తూ మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తున్నాడు. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు పొందిన యువరాజ్ ఆ తరువాత కెప్టెన్సీపై మోజుతో తన అసలు బాధ్యతలను మరచిపోయాడు. తనకన్నా వెనక జట్టులోకి వచ్చిన ధోనీకి నాయకత్వం ఇవ్వడమేమిటనే దుగ్ధ అతని ఏకాగ్రతను దెబ్బతీసింది. చివరికి జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే పరిస్థితి వచ్చాకగాని.. యువరాజ్‌కు తత్త్వం బోధపడలేదు. తిరిగి వాస్తవ ప్రపంచంలోకి వచ్చి తాను పోషించాల్సిన పాత్రపై దృష్టి నిలుపుతున్నాడు. ఫలితమే ప్రపంచకప్ టోర్నీలో తన సత్తాను పూర్తిస్థాయిలో ప్రదర్శించగలుగుతున్నాడు. అంతేకాదు.. తీవ్ర ఒత్తిడిలోనూ పరిణతి చెందిన ఆటతీరుతో ఒంటిచేత్తో జట్టుకు విజయాలందిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చూపిన తెగువే అందుకు నిదర్శనం. పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో దురదృష్టవశాత్తూ తొలిబంతికే ఔటయ్యాడు. లేదంటే పాక్ బౌలర్లు యువరాజ్ విశ్వరూపమే చూడాల్సి వచ్చేది. టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రతిభతో 341 పరుగులు, 12 వికెట్లు తీసిన యువీ.. నాలుగు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్నాడు. శ్రీలంకతో జరిగే ఫైనల్‌లో భారత్ విజయం సాధించి ప్రపంచకప్ సాధిస్తే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గానూ యువరాజ్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచకప్ తరువాత కూడా యువరాజ్ ఇదే క్రమశిక్షణతో ఉండి తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుందాం.

No comments:
Post a Comment