వైఎస్ వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారట. ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తయినందునే రాజీనామా చేస్తున్నానని, రాజ్యాంగం ప్రకారం మరో ఆరు నెలలు మంత్రిగా కొనసాగే అవకాశం ఉన్నా నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తన రాజీనామాను ఆమోదించే విషయంలో తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రిదేనని, పార్టీ ఆదేశిస్తే కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో దేనికైనా పోటీకి సిద్ధమని కూడా ప్రకటించారు. ఇంతకూ ఆ ఎన్నికల్లో పోటీ చేస్తాననేది కాంగ్రెస్ అభ్యర్థిగా తాను గెలిచేందుకా.. లేక టికెట్ ఇతరులకు దక్కితే జగన్ గెలుపు కష్టమవుతుందనే ఉద్దేశంతోనా..? అన్నదే అందరిలోనూ రేకెత్తుతున్న ప్రశ్న. అటువంటి ఆలోచనే లేకపోతే తన పదవీకాలం ముగిసిపోనుందని తెలిసి కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా సైలెంట్‌గా ఎందుకున్నట్టు? రోజుల వ్యవధిలోనే ముగిసిపోయే తన ఎమ్మెల్సీ పదవికి ముందే రాజీనామా చేసి కడప స్థానానికి స్థానిక అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో దిగి గెలవచ్చుగా! అలా చేయకుండా జగన్ వర్గం అభ్యర్థి గెలుపునకు సహకరించి కాంగ్రెస్‌ను దెబ్బతీసే చర్యల్లో పాలుపంచుకున్నాడు. పైగా ఎవరికీ అనుమానం రాకుండా జగన్ మీడియాలో తనపై వ్యతిరేక కథనాలు వచ్చేలా చూసుకున్నాడు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటికి వెళ్లి వ్యూహాత్మకంగా తన బాబాయిని మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంచి ‘అవసరమైనప్పుడు’ కాంగ్రెస్ నుంచి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డాడు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా ఈ బాబాయి-అబ్బాయిల వ్యవహారంపై జాగ్రత్త వహిస్తే మంచిది. లేదంటే మరోసారి ‘స్థానిక ఎమ్మెల్సీ’ ఎన్నికల్లో మాదిరిగానే అవకాశవాదుల చేతిలో మోసపోక తప్పదు.
No comments:
Post a Comment